TG DGP : వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో విజేతలుగా నిలిచిన తెలంగాణ పోలీస్ ప్లేయర్స్‌ను డీజీపీ జితేందర్ అభినందించారు. అమెరికాలోని అలబామా రాష్ట్రం బర్మింగ్‌హామ్‌లో జూన్ 27 నుంచి జూలై 6 వరకు జరిగిన ఈ గేమ్స్‌లో తెలంగాణ పోలీసులు మొత్తం 10 పతకాలు సాధించారు. అందులో మూడు గోల్డ్, ఒక సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. తెలంగాణ పోలీస్ టీమ్ వాటర్ స్పోర్ట్స్ కోచ్ పీ కృష్ణారావు (వనపర్తి హెడ్ కానిస్టేబుల్) రెండు బంగారు పతకాలు గెలిచారు. 2000 మీటర్లు, 500 మీటర్ల రోయింగ్ ఈవెంట్లో 50 ఏళ్ల కేటగిరీలో ఆయన ఆ పతకాలు అందుకున్నారు.
ఇక షాట్‌పుట్‌లో, 110 మీటర్ల హర్డిల్స్‌లో 35 ఏళ్ల కేటగిరీలో తెలంగాణ పోలీస్ అథ్లెటిక్స్ కోచ్ మహ్మద్ బాబా (కామారెడ్డి జిల్లాలోని పెద్దకొండపల్లి పీఎస్‌లో కానిస్టేబుల్) రెండు కాంస్య పతకాలు నెగ్గారు. తెలంగాణ పోలీస్ తైక్వాండో ప్లేయర్స్ గోపాలక్రిష్ణయ్య సైబరాబాద్ రాజేంద్రనగర్ హెడ్ కానిస్టేబుల్ 40 ఏళ్ల కేటగిరీలో మూడు పతకాలు సాధించారు. 80 కిలోలలోపు క్యోరుగి ఈవెంట్లో ఒక రజతం, రికగ్నైజ్డ్ పూమ్సే (Poomsae), ఫ్రీస్టైల్ పూమ్సే ఈవెంట్స్‌లో రెండు కాంస్యాలు నెగ్గారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసే ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ డీ సంజీవ్ కుమార్ మూడు పతకాలు గెలిచారు. 30 ఏళ్ల కేటగిరీ క్యోరుగి ఈవెంట్లో ఒక బంగారు పతకం, రికగ్నైజ్డ్ పూమ్సే (Poomsae), ఫ్రీస్టైల్ పూమ్సే ఈవెంట్స్‌లో రెండు కాంస్యాలు నెగ్గారు. విజేతలందరినీ డీజీపీ జితేందర్ అభినందించారు. కార్యక్రమంలో ఐజీపీ స్పోర్ట్స్ ఎం రమేశ్, స్పోర్ట్స్ ఆఫీసర్, డీఎస్పీ ఆర్వీ రామారావు పాల్గొన్నారు.