హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రతి జిల్లా కేంద్రం, కమిషనరేట్‌లో ఉన్న జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో (డీసీఆర్బీ)ని మరింత పటిష్టం చేస్తామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. మార్చి మొదటి వారంలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచి రోజువారి, వారాంతపు, నెలవారి, వార్షిక క్రైమ్ నివేదికలను పరిశీలిస్తామని, నేరాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతామని చెప్పారు.
ఈ నివేదికలను స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరోకు అనుసంధానిస్తామని, ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో అద్భుతంగా పనిచేసే 10 మందికి రివార్డు అందిస్తామని డీజీపీ ప్రకటించారు.