హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు గత జనవరి 24న నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్ -2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆలిండియా క్యాటగిరీ ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా నలుగురు విద్యార్థులు క్యాటగిరీ ర్యాంకులను సొంతం చేసుకొన్నారు. ఆలిండియా ఎస్టీ క్యాటగిరీ టాపర్‌గా రాష్ట్ర విద్యార్థి వివేక్‌జిత్ దాస్ నిలువగా, ఎస్టీ క్యాటగిరీ టాపర్లుగా బోడ ప్రభంజన్దాస్, బానోత్ రిత్విక్లిద్దరు రాణించారు. ఇక పీడబ్ల్యూడీ (వికలాంగ) కోటా టాపర్‌గా రాష్ట్ర విద్యార్థి చుంచికల శ్రీచరణ్ నిలిచారు. బీఆర్క్‌లో తెలంగాణ స్టేట్ టాపర్‌గా దేవజ్యోతి రాయ్ బర్మన్ నిలువగా, బీ ప్లానింగ్‌లో తెలంగాణ టాపర్‌గా జెస్విన్ జోస్ నిలిచారు. బీఆర్క్‌లో తమిళనాడు విద్యార్థి ఆర్ ముత్తు, బీ ప్లానింగ్‌లో ఏపీ విద్యార్థి కే సాకేత్ ప్రణవ్‌లు మాత్రమే జాతీయంగా 100 పర్సంటైల్ సాధించారు.