హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించటం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నెరవేర్చాల్సిన ఏ హామీని కూడా కేంద్రం నెరవేర్చటం లేదని విమర్శించారు. అర్థ గణాంక, ప్రణాళిక, టీఎస్‌డీపీఎస్ శాఖలు రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్‌ను బుధవారం జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సహకారం లేకపోయినా తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నదని చెప్పారు. ఇప్పటిదాకా విద్యుత్తు, నీటిపారుదల రంగాలకు రాష్టప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, ఇక.. విద్య, వైద్య రంగాలే తదుపరి ప్రాధాన్యతలని, ఈ రంగాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నట్టు వెల్లడించారు. మన ఊరు-మన బడి, కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించి విద్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించనున్నట్టు వివరించారు.
ఆదివాసీ జిల్లాల్లోనే ఆడపిల్లలు అధికంగా ఉండటం శుభసూచకమని వినోద్ కుమార్ అన్నారు. గిరిజనులు అధికంగా ఉండే ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనే ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్టు నివేదిక ద్వారా స్పష్టమైందని చెప్పారు. రాజకీయాల కోసం తాము పనిచేయడం లేదని, అభివృద్ధే ఏకైక ఎజెండాగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. అసమానతలను రూపుమాపేందుకే నూతన జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని, 95 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. తలసరి అప్పులు పెరిగాయన్న ప్రశ్నకు.. తాము అప్పులు తెచ్చినా, వాటిని మూలధన వ్యయానికే (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఖర్చుచేస్తున్నామని, కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసమే ఖర్చుపెట్టామని వినోద్ వెల్లడించారు. ఆనాడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ సైతం అప్పు చేసే కట్టారని గుర్తుచేశారు. అప్పులతో తెలంగాణ విలువ తగ్గలేదని, అప్పులను ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లపై పెట్టడంతో ప్రజల ఆస్తి విలువ గణనీయంగా పెరిగిందని వివరించారు. ఒకప్పుడు నాలుగైదు లక్షలుగా ఉన్న ఎకరం భూమి విలువ.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో రూ.20-25 లక్షలు పలుకుతున్నదని తెలిపారు. నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే రాష్ర్టాన్ని సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీసినట్టు ఉన్నదని పేర్కొన్నారు.
తెలంగాణకు ఒక నీతి, వేరే రాష్ర్టాలకు మరో నీతి అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తున్నదని వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్ట్‌ను కేటాయించాల్సి ఉన్నా ఇవ్వడం లేదని, భవిష్యత్తులో జాతీయ ప్రాజెక్ట్‌లు ఇవ్వబోమని ప్రకటించిందని అన్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లో రూ.49 వేల కోట్లతో, కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్రం ప్రకటించిందని, ఇదేం నీతి అని ఫైరయ్యారు. బయ్యారం ఉక్కు కర్మాగారంపై కేంద్రం తీరు సరికాదని ఆక్షేపించారు. జాతీయ రహదారులంటూ కేంద్రమంత్రులు ప్రకటించినా అవన్నీ సూత్రప్రాయంగా అంగీకరించినవే తప్ప పురోగతి లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్థిక, ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ గట్టు దయానందం తదితరులు పాల్గొన్నారు.