హైదరాబాద్, ఆక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్ణయించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజనకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను గ్రేడ్-1, 2, 3, 4గా పునర్వ్యవస్థీకరించి జోన్లవారీగా క్యాడర్ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్లను జేపీఎస్‌లుగా మార్చి రెగ్యులరైజ్ చేయాలని పీఆర్ డైరెక్టర్‌ను కోరినట్టు తెలిపారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, ఉపాధ్యక్షులు రమేశ్ పాల్గొన్నారు.