హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన అధ్యక్షతన ప్రజాభవన్‌లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఇప్పటివరకు కుదుర్చుకున్న ఎంవోయూల అమలు, కొత్త పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఇక నుంచి ప్రతీ శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహిద్దామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాంతంలో హ్యుందాయ్ గ్లోబల్ ఇన్నోవేషన్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపనకు సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. రూ.8,528 కోట్ల పెట్టుబడితో 675 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ ఆర్అండ్డీ కేంద్రం ద్వారా కొత్తగా 4,276 మంది యువతకు ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్, డైరెక్టర్ మల్సూర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాసర్ తదితరులు పాల్గొన్నారు.