సర్కారుపదేండ్ల కేసీఆర్ పాలనా ప్రగతిని వక్రీకరించనున్నారా? అభివృద్ధి లెక్కలను తారుమారు చేయనున్నారా? తెలంగాణ ఆర్థిక చరిత్రను తిరగరాయనున్నారా? బీఆర్ఎస్ పాలనలో ప్రగతి కొత్త పుంతలు తొక్కినట్టు చాటిన గణాంక నివేదిక-2024ను రద్దు చేయనున్నారా? ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినట్టు చెప్పబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. గతవారం విడుదల చేసిన అట్లాస్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. తమకు అనుగుణంగా నివేదికను మార్చాలని ఒత్తిడి తెస్తున్నది.
Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కేసీఆర్ పాలనా ప్రగతి వివరాలు పొందపర్చకుండా శాఖల వారీగా వివరాలు లేకుండా, కొత్త గణాంకాలతో సరికొత్తగా అట్లాస్ రూపుదిద్దుకోబోతున్నది. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, గణాంకాలను తగ్గించి, వక్రీకరించి, మసకబార్చి, ప్రజలను ఏమార్చేలా కొత్త నివేదిక రాబోతున్నది.కేవలం ఏడాది పాలనా తీరును వెల్లడించేలా మరో నివేదిక విడుదల చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. కేసీఆర్ అభివృద్ధి ఘనతను చెరిపేసి తన చరిత్రను తానే రాసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. ఈ మేరకు మరోసారి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ (అట్లాస్) నివేదిక-2024 విడుదలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ (అట్లాస్) నివేదిక-2024ను గత వారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్), తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) భాగస్వామ్యంతో 184 పేజీలతో దానిని రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిన దశాబ్ద ప్రగతి, వివిధ రంగాల ప్రగతి డాటా, గ్రాఫిక్స్‌తో కూడిన వివరాలను ఆ నివేదికలో పొందుపర్చారు. వాటిని ఎదురొనే ధైర్యం లేని సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ నివేదికను రూపొందించిన అధికారులపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.
తప్పులు దొర్లాయనే సాకుతో వేటు
కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని జీర్ణించుకోలేక అట్లాస్‌లో అక్కడక్కడా కొన్ని అక్షర దోషాలు దొర్లాయనే సాకుతో సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులపై వేటువేయడం ఎంతవరకు సమంజమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. టీఎస్‌డీపీఎస్ డైరెక్టర్ మీరాతోపాటు ఇద్దరు జాయింట్ డైరెక్టర్లను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, కిందిస్థాయి సిబ్బందిని బదిలీ చేయాలని, ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని సీఎం ఆదేశించడం తగదని అంటున్నారు. నిజాలకు భయపడుతున్న రేవంత్‌రెడ్డి.. అధికారులపై చర్యలకు దిగడం ఆయన చేతగానికితనానికి నిదర్శనమని చెప్తున్నారు. నిజాలను ఎదురొనే సాహసం చేయలేక, అధికారులపైనే ఒత్తిడి తెచ్చే చర్యలు న్యాయమైనవని ప్రశ్నిస్తున్నారు.
కొత్త నివేదిక రూపకల్పనకు ఆదేశాలు?
కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు సాగిందని అట్లాస్ నివేదిక స్పష్టంచేస్తున్నది. తెలంగాణ అభివృద్ధిని చూసిన ప్రజలు నిజాలను అర్థం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే నివేదిక ప్రజల్లోకి వెళ్తే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సీఎం భావించినట్టు సమాచారం. ‘మా శాఖ ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న ఎన్నో నివేదికలు ఎంతో మంది యువతకు రిఫరెన్స్‌గా ఉపయోగపడుతున్నాయి. మా నివేదికల గణాంకాల ఆధారంగానే జవాబులు రాసి ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. అలాంటిది మేము రూపొందించిన నివేదికను పూర్తిగా మార్చాలని సీఎం ఆదేశించారు. కొత్తగా మళ్లీ అట్లాస్ రూపొందించాలని ఆదేశాలు వచ్చాయి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీఎస్‌డీపీఎస్ ఉద్యోగి ఒకరు చెప్పారు.