హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ‘ఎవరి కండ్లలో ఆనందం కోసం? ఎవరిని ఆనంద పరచడం కోసం నాపై నిధారార, అవాస్తవ వార్తలు రాశారు రాధాకృష్ణా?’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పెట్టుబడుల కట్టు కథలు అల్లి రాధాకృష్ణ తనపై విషపు రాతలు రాశారని, ఆయన ఆరోపణలు పూర్తి నిరాధారమైనవి, వాస్తవ దూరమైనవని స్పష్టంచేశారు. కాబట్టి రాధాకృష్ణ తాను రాసినవన్నీ అవాస్తవాలని స్వయంగా తిరిగి రాయాలని, లేదంటే ఆయన రాతలు తన వ్యక్తిత్వ హననంగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో భట్టి మీడియాతో మాట్లాడారు. 40 ఏండ్లుగా ఉన్నత విలువలతో తాను పనిచేస్తున్నానని, ఒక్క కలంపోటుతో తన వ్యక్తిత్వ హననానికి రాధాకృష్ణ పూనుకున్నారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అందుకే వాస్తవాలు వివరించానని చెప్పారు. రాధాకృష్ణ రాసిన రాతలు అవాస్తవమని, ఆయన స్వయంగా తిరిగి ప్రజలకు వివరించాలని, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు.
నేను 40 ఏండ్లుగా ఉన్నత విలువలతో పనిచేస్తున్న. ఒక్క కలం పోటుతో రాధాకృష్ణ నా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నరు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోను. అందుకే వాస్తవాలు వివరించిన. తాను రాసిన రాతలు అవాస్తవమని రాధాకృష్ణ తిరిగి ప్రజలకు వివరించాలి. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటా.
– భట్టి విక్రమార్క