హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మద్యం ధరలు పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయం లో సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత శాఖ అధికారులతో బడ్జెట్ అంచనాలపై సమీక్షించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలైట్ బార్లు/ఎలైట్ షాప్లు వంటివి నెలకొల్పడానికి ఏకీకృత విధానంలో ఒక వ్యవస్థను ఏర్పాటుచేసి మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పారు. ఎక్సైజ్, పోలీసు, సమాచార శాఖలతో కూడిన మల్టీడైమెన్షనల్ టీమ్లను ఏర్పాటుచేసి డ్రగ్స్ ముప్పుపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందాలంటే ఎండోమెంట్, టూరిజం, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.
రాష్ట్రంలో సమృద్ధిగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ సరైన మారెటింగ్ వ్యవస్థ లేకపోవడం వలన వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మాత్రమే అన్ని టూరిజం ప్రాజెక్టులను చేపట్టలేదని, పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎక్సైజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, టూరిజం అండ్ కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎక్సైజ్ , టూరిజం, కల్చర్, ఆరియాలజీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సంపద సృష్టికర్తలను ఇబ్బందిపెట్టం
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార వెల్లడించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చే సంపద సృష్టికర్తలను ఏమాత్రం ఇబ్బంది పెట్టబోమని, వారు ఎదురొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో భట్టి విక్రమారను కలిసింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ థేమ్స్ నదిలా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తాము సంకల్పించామని, దీనితో పాటు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
మూసీ నది శుద్ధితో సుందరీకరణ జరిగి, పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని, ఫుడ్ కోర్టులు, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లు జరిగే అవకాశం ఉందని తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తిగా మారుతుందని అన్నారు. డబ్బులు కట్టి గత రెండు మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కొన్ని ప్రతిపాదనలను మంత్రికి నివేదించింది. కౌన్సిల్ తెలంగాణ విభాగం ప్రతినిధులు మేకా విజయసాయి, కే శ్రీధర్ రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్ రెడ్డి, చలపతి రావు, భూపాల్ రెడ్డి, మారోజు శ్రీధర్ రావు, అశోక్, రామిరెడ్డి వెంకట్ రెడ్డి, కేకే రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.