హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): చేప, మంచినీటి రొయ్య పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. సీజన్ పూర్తి కావొస్తున్నా పథకంపై సరైన దృష్టి పెట్టడంలేదు. చేపపిల్లల పంపిణీ లక్ష్యం సగమే పూర్తి కాగా, కొన్ని జిల్లాల్లో మొదలే పెట్టలేదు. చేప పిల్లల పంపిణీ సంగతి అలా ఉంటే, రొయ్య పిల్లల పంపిణీ కోసం టెండర్లే ఖరారు చేయలేదు. దీంతో మత్స్యకారులకు నిరీక్షణ తప్పడంలేదు. 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలోని 30,358 నీటివనరుల్లో రూ.123 కోట్లతో 83 కోట్ల చేపపిల్లలను, రూ.29 కోట్లతో 10 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని మత్స్యశాఖ చెప్పింది.
ఆగస్టులో ప్రారంభించాల్సిన చేప పిల్లల పంపిణీని.. ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో అక్టోబర్ చివరి వారంలో మొదలుపెట్టింది. నవంబర్ 30 వరకు పంపిణీని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. కేవలం1,632 చెరువుల్లో 6.15 కోట్ల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. ఇంకా 17 జిల్లాల్లో పంపిణీ ప్రారంభించలేదు. పంపిణీ చేసిన జిల్లాల్లో కూడా నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం కూడా పూర్తిచేయలేదు. మత్స్యశాఖ అధికారులు మంచినీటి రొయ్యల పంపిణీ ఊసే ఎత్తడంలేదని, టెండర్ల ఖరారుపై కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. అర్హతలేని ఏజెన్సీలకు టెండర్లు కట్టబెట్టేందుకే ప్రభుత్వంలోని కొందరు నాయకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం.. అధికారుల అలసత్వం
ప్రభుత్వం చేప, రొయ్య పిల్లల పంపిణీని జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో మత్స్యశాఖ అధికారులు సహకరించడం లేదని మత్స్యకారులు చెప్తున్నారు. దీంతో చేపపిల్లలను సరఫరా చేసే ఏజెన్సీలు కూడా అధికారుల తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏజెన్సీల ఎంపిక విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా పంపిణీ చేస్తే చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సత్ఫలితాలు సాధించడం కష్టమని చెప్తున్నారు. నిరుడు కూడా ఇలాగే నష్టపోయామని గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలని, అధికారులు అలసత్వం వీడాలని మత్స్యకారులు కోరుతున్నారు.