హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : సవరించిన మోటరు వాహనాల నియమాలు-2025 కింద 10, 15, 20 ఏండ్లకు పైబడిన వాహనాలకు వర్తించే ఏజ్ బేస్డ్ స్లాబ్స్‌లలో ఫిట్నెస్ పరీక్ష రుసుములను కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 9 నుంచి రవాణా/వాణిజ్య వాహనాల బంద్‌కు సర్వం సిద్ధమైంది. కేంద్ర అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా సౌత్ ఇండియా మోటర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఎస్‌ఐఎంటీఏ) ఈ నెల 9 అర్ధరాత్రి నుంచి ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.
కేంద్రం తీరుతో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది యాప్-ఆధారిత , రవాణారంగం కార్మికుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఇప్పటికే అధిక ఇంధన ధరలు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ప్లాట్‌ఫారమ్ కమీషన్లతో డ్రైవర్లు ఆగమవుతున్న తరుణంలో అకస్మాత్తుగా పెంచిన ఫిట్నెస్ ఛార్జీలు అదనపు ఆర్థిక భారాన్ని మోపుతాయి. కొత్త వాహనాలను కొనలేని స్థితిలో పాత వాటిపైనే ఆధారపడి బతుకుతున్న కార్మికులను ఈ నిర్ణయం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం వెంటనే రుసుమును తగ్గించాలని ఎస్‌ఐఎంటీఏ డిమాండ్ చేస్తున్నది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరుతున్నది.
ఎస్‌ఐఎంటీఏ ఆందోళనకు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ఉపాధ్యక్షుడు అత్తినమోని నాగేశ్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9 నుంచి జరిగే ఆందోళనల్లో తాము కూడా కలిసి పోరాడుతామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై బీఆర్టీయూ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఎస్‌ఐఎంటీఏ చేపట్టిన ఈ న్యాయమైన పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన 12 ఏండ్లు పైబడిన వాహన యజమానులు, కార్మికులందరికీ మద్దతు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్రం తన నిర్ణయాన్ని వెనకి తీసుకునేవరకూ ఈ రెండు సంఘాలు ఒకే స్ఫూర్తితో బంద్‌లో పాల్గొంటాయని చెప్పారు. తక్షణమే సవరించిన రుసుము నిర్ణయాన్ని సమీక్షించాలని నాగేశ్ డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మిక-కేంద్రీకృత విధానాలను రూపొందించాలని బీఆర్టీయూ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి రవాణా కార్మికుడికి బీఆర్టీయూ అండగా నిలుస్తుందని, వారి హకుల కోసం పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.