లింగాల, అక్టోబర్ 26: శిరోముండనం ఘటనలో ఎస్సైపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడమేంటని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ప్రశ్నించారు. ముగ్గురు యవకుల శిరోముండనం ఘటనలో లింగాల ఎస్సై జగన్మోహన్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చేరుకొని బాధిత యువకులు, చుట్టుపక్కల ప్రజలతో మాట్లాడి వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువకులు తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప అవమానపర్చేలా గుండు గీయించడం ఏ చట్టం లో లేదని చెప్పారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన ఎస్సైని అటాచ్ చేయడం చూస్తుంటే రాజకీయ జోక్యం కూడా తోడైందనిపిస్తున్నదని ఆరోపించారు. ఎస్సైని పూర్తిగా విధుల నుంచి తొలగిం చి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.