ఊట్కూర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల్లో ( Lift irrigation ) భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం నారాయణపేట ఆర్డీవో రామచందర్( RDO Ramchander ) ఊట్కూర్ మండల తహసీల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని త్రిప్రాస్ పల్లి, బాపురం శివారు గ్రామాల్లో ఓపెన్ కెనాల్( Open Canal ) , పైపులైన్ ( Pipe Line ) , సంప్ హౌస్ ( Sump House ) నిర్మాణాల్లో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు.
ఆర్డీవో మాట్లాడుతూ .. పేట, కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ ద్వారా ఊట్కూర్ పెద్ద చెరువు, నారాయణపేట మండలం పేరపళ్ల జాయమ్మ చెరువుకు సాగునీరు అందించేందుకు సర్వే పనులు పూర్తి చేశామన్నారు. సర్వే పట్ల రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందించి ఆదుకుంటామని తెలిపారు. పలువురు రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు రూ. 60 లక్షలు చెల్లించాలని, లేనిపక్షంలో భూమికి బదులు భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల కుటుంబాల్లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆర్డీవోను కోరారు. ఓపెన్ కెనాల్, పైప్ లైన్ నిర్మాణం కోసం చేపట్టిన సర్వే నెంబర్లు, సాగులో ఉన్న వ్యవసాయ పొలాల విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయని, రైతుల సమక్షంలో రీ సర్వే నిర్వహించి తగిన న్యాయం చేయాలని అన్నారు.
తమ తాతల కాలం నాటి వ్యవసాయ భూములను కోల్పోతే భవిష్యత్తులో తమ కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ చింత రవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.