బన్సీలాల్‌పేట్, జనవరి 11 : నర్సు ఉద్యోగాలకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉన్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో ‘విదేశాల్లో ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాణికుముదిని మాట్లాడుతూ, నర్సింగ్ వృత్తిలో నైపుణ్యం, అనుభవంతో పాటు విదేశీ భాషలో ప్రావీణ్యం సంపాదిస్తే అనేక దేశాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని చెప్పారు.
టామ్‌కామ్ సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న నర్సులకు శిక్షణ ఇవ్వడానికి అన్ని జిల్లాలలో అవగాహనా శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 12 దేశాల భాషలపై ఆరు నెలల శిక్షణ అనంతరం వారికి గ్యారంటీగా ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని చెప్పారు. వివిధ దేశాల్లో పేషెంట్ కేర్ అసిస్టెంట్, ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడానికి ‘తెలంగాణ టామ్‌కామ్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా వివిధ దేశాల స్టాళ్ల వద్ద నర్సింగ్ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. కార్యక్రమంలో బ్రిటిషు డిప్యూటి హై కమిషనర్ గరెత్ ఓవెన్, సీఎం ఓఎస్డీ (హెల్త్) డాక్టర్ గంగాధర్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ కమిషనర్ నదీమ్ అహ్మద్, డీఎంఈ డాక్టర్ కే రమేశ్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ ఎం రాజారావు, తెలంగాణ నర్సింగ్ విభాగం రిజిస్ట్రార్ విద్యావతి, డిప్యూటి డైరెక్టర్ విద్యుల్లత, టామ్‌కామ్ జీఎం నాగభారతి హాజరయ్యారు.