హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అటవీకరణ నిధుల (కంపా)తో చేపడుతున్న అటవీ పునరుద్ధరణ పనులతో క్షీణించిన అడవుల్లో మళ్లీ పచ్చదనం పెరుగుతున్నది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో 29,545 హెక్టార్ల విస్తీర్ణంలో 84 బ్లాకులలో విస్తరించిన అటవీ ప్రాంతంలో దాదాపు 474 హెక్టార్లలో అటవీ పునరుద్ధరణ పనులను కొనసాగిస్తున్నది. ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్, శంషాబాద్, మంఖాల్, గున్గల్ అటవీ రేంజ్ పరిధిలో ప్రత్యామ్నాయ అటవీకరణ, అటవీ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. గున్గల్ అటవీ రేంజ్ పరిధిలో 160 హెక్టార్లలో, గుమ్మడవెల్ల్లి, మాదాపూర్ రేంజ్లో 105 హెక్టార్లలో, పడ్కల్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో 70 హెక్టార్లలో, కొత్వాల్‌గూడ, మల్కారంలో 82 హెక్టార్లలో, పల్లెగూడ రిజర్వు ఫారెస్ట్‌లలో 57 హెక్టార్లలో అటవీశాఖ మొక్కలు నాటింది. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి ఖాళీల్లో కొత్త మొక్కలను పెడుతున్నారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కందకాలు, చైన్‌లింక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. గట్లపైన గచ్చకాయ చెట్లను పెంచారు. చెక్‌డ్యామ్‌లు, వర్షంనీటి నిల్వకోసం కందకాల తవ్వకం, నర్సరీల పెంపు ద్వారా అటవీ సాంద్రత పెరిగింది.