హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు మళ్లీ ఆటంకం ఏర్పడింది. స్కూల్ అసిస్టెంట్టు, ఎస్జీటీల బదిలీలను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా టీచర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానంపై బదిలీలపై ఈ నెల 19 వరకు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా సిద్ధమయ్యే వరకు బదిలీలు ఆపాలని, నిబంధనలకు విరుద్ధంగా కోటాకు మించి రంగారెడ్డి జిల్లాకు అదనంగా టీచర్లను బదిలీ చేశారని, వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ స్కూల్ అసిస్టెంట్లు ఎస్ గోపీకృష్ణ, మరో నలుగురు హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. తాము రంగారెడ్డి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్టు, ఎస్జీటీలుగా పనిచేస్తున్నామని, రాష్ట్రపతి ఉత్తర్వులు, 2018లోని నిబంధనల ప్రకారం స్థానికులమని పిటిషనర్లు తెలిపారు. చాలా కాలం తరువాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ క్యాడర్ల టీచర్ల బదిలీ, పదోన్నతులకు అవకాశం కల్పిస్తూ జీవో నం.5 జారీ చేసిందని పేర్కొన్నారు. అధికారులు రూపొందించిన సీనియార్టీ జాబితాపై పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తారు. ఇతర జిల్లాల వారిని జాబితాలో చేర్చి ప్రచురించారని ఆరోపించారు. ఇది స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లోని 38(డి) నిబంధనకు విరుద్ధమని తెలిపారు. సీనియారిటీ తుది జాబితా సిద్ధమయ్యే వరకు బదిలీలు ఆపాలి అని విజ్ఞప్తిచేశారు. ఈ వివరాలు విన్న న్యాయమూర్తి.. టీచర్ల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.