హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): అభ్యర్థులు నామినేషన్ ఫారాన్ని సంపూర్ణంగా పూర్తిచేయకుంటే రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నోటీసు ఇస్తారని, అప్పటికీ స్పందించకుంటే నామినేషన్‌ను తిరస్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల నియామళి అమలుకు అందరూ సహకరించాలని కోరారు. బీఆర్కేఆర్ భవన్లో సోమవారం వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ వేసే అభ్యర్థులు ప్రతి కాలమ్‌ను పూర్తిచేయాలని.. లేకుంటే, ఆర్వోలు నామినేషన్ వేసిన వారికి నోటీసులు ఇస్తారని తెలిపారు. నోటీసు ఇచ్చాక కూడా స్పందించకుంటే నామినేషన్ల పరిశీలన సమయంలో వాటిని తిరస్కరించే అధికారం ఆర్వోకు ఉంటుందని చెప్పారు. ఈవీఎం మీద ఉండే బ్యాలట్ పేపర్ మీద అభ్యర్థి పేరుతోపాటు ఫొటో, ఎన్నికల గుర్తు ఉంటాయని తెలిపారు. పోస్టల్ బ్యాలట్ పేపర్ మీద కూడా అభ్యర్థి ఫొటో ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు మీడియాలో ఇచ్చే ప్రకటనలకు ముందస్తుగా జిల్లా స్థాయి కమిటీ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికలపై ఫిర్యాదులు చేయడానికి 1950 నంబర్‌కు ఫోన్ చేయాలని, 24 గంటలు ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఖర్చులను నమోదు చేయడానికి ఎన్నికల కమిషన్ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలక్షన్ కమిషన్‌కు డిప్యూటేషన్గా పరిగణిస్తామని తెలిపారు. వారు విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. రోడ్‌రోలర్ గుర్తుపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సదుపాయం
ఎనభై ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించామని తెలిపారు. ఇందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పా రు. దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రంలో ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వారికి ఉచిత రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో డమ్మీ బ్యాలట్ షీట్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించవద్దని సూచించారు. ఓటు హక్కు కోసం కొత్తగా పేరు నమోదు చేసుకొనేవారికి అక్టోబరు 31 వరకు అవకాశం ఉందని చెప్పారు. అభ్యర్థులు తమ నేరచరిత్రను మీడియాలో తెలపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో లోకేశ్ కుమార్, డిప్యూటీ సీఈవో సత్యవాణి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ పాల్గొన్నారు.