Crop Loans | నెన్నెల, సెప్టెంబర్ 24 : అప్పు చెల్లించడంలేదన్న సాకుతో బ్యాంకు అధికారులు ఓ రైతు ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. సదరు రైతు ఇంటి తలుపులు ఊడబీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్నది. నెన్నెలకు చెందిన రైతు గట్టు శివలింగయ్య, అతని తమ్ముడు భానేష్ కలిసి తల్లి పేరిట ఉన్న భూమి తనఖా పెట్టి దాదాపు 8 ఏండ్ల క్రితం భూమి అభివృద్ధి కోసం రూ.2 లక్షలు, శివలింగయ్య తన పేరిట రూ.లక్ష అప్పుగా తీసుకున్నారు. అప్పుతీసుకున్న పట్టాదారైన శివలింగయ్య తల్లి నాలుగేండ్ల కిందట చనిపోయింది.
అయినప్పటికీ విడతల వారీగా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. ఆరు నెలల క్రితం శివలింగయ్య రూ.20 వేలు బ్యాంకులో చెల్లించాడు. ఈ క్రమంలో మంగళవారం డీసీసీ బ్యాంకు అధికారులు.. రైతు శివలింగయ్య ఇంటికి వచ్చి తీసుకున్న అప్పు చెల్లించాలని పట్టుబట్టారు. రూ.3.60 లక్షల వరకు అప్పు ఉన్నదని, మొత్తం కట్టాలని ఒత్తిడి చేశారు. తన వద్ద అంత డబ్బులేదని, ఇప్పుడు రూ.20 వేలు చెల్లిస్తానని విన్నవించుకున్నాడు. పూర్తిగా చెల్లిస్తేనే సరి.. లేదంటే ఇంట్లో ఏముంటే అదిపట్టుకుపోతామని బెదిరించారు.
దాదాపు రెండు గంటలపాటు వేడుకున్నా వినలేదు. చివరకు ఇంటి తలుపులను అధికారులు ఊడదీశారు. చుట్టుపక్కల వారు వచ్చి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న డబ్బులను కడతానంటే ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. పేద రైతును ఇలా బజారుకు ఈడుస్తారా? అని మండిపడ్డారు. ఊడదీసిన తలుపులు ఎలా తీసుకెళ్తారో చూస్తామని స్థానికులు ఎదురు తిరగడంతో అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి డీసీసీబీ మేనేజర్ సురేశ్‌ను ‘నమస్తే’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.