e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home తెలంగాణ భగ్గుమన్న దళిత వాడలు

భగ్గుమన్న దళిత వాడలు

  • ఊరూరా ఈటల దిష్టిబొమ్మల దహనం
  • అనేకచోట్ల డప్పుచప్పుళ్లతో శవయాత్రలు
  • బీజేపీని బొంద పెట్టి తీరుతామని శపథం

కరీంనగర్‌, అక్టోబర్‌ 19 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై దళితులు భగ్గుమన్నారు. ఈసీకి లేఖలతో దళితబంధు నిలిపివేయించి తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టాడని ఈటల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపా రు. మంగళవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎక్కడ చూసినా ఇవే ఆందోళనలు కనిపించాయి. దళిత ద్రోహి ఈటలను తమ వాడల్లోకి రానీయమని, ఈ ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టి తీరుతామని శపథం చేశారు.

దళితులు బాగుపడటం ఇష్టంలేకనే..

దళితులు బాగుపడటం ఇష్టం లేని ఈటల రాజేందర్‌ ఈర్షతోనే ఈసీకి లేఖ రాశారని దళితులు ఆరోపించారు. ఆయన రాసిన లేఖ ఆధారంగానే హుజూరాబాద్‌లో దళితబంధు నిలిచిపోయిందని మండిపడ్డారు. ఈటల లేఖ రాసినప్పుడే తాము ఆందోళన చెందామని, లేఖను వెనక్కి తీసుకోవాలని చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

అట్టుడికిన గ్రామాలు

- Advertisement -

ఈటల రాసిన లేఖతో దళితబంధు నిలిచిపోయిందని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ఆందోళనలతో అట్టుడికాయి. వీణవంకలో ని కరీంనగర్‌-జమ్మికుంట రహదారిపై 500 మందికిపైగా దళితులు బైఠాయించారు. చల్లూరు, రెడ్డిపల్లి, వల్భాపూర్‌ గ్రామాల్లో ఈటల దిష్టిబొమ్మలు దహనంచేశారు. హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌లో ఈటల శవయాత్రను నిర్వహించారు. కందుగుల, కనుకులగిద్దెలోనూ ఈటల శవ యాత్రలు నిర్వహించారు. జమ్మికుంటలోని అంబేద్కర్‌ కాలనీతోపాటు ధర్మారంలో ఈటల దిష్టిబొమ్మలు దహనం చేశారు. జమ్మికుంట మండలం మాచనపల్లిలో ఈటల దిష్టిబొమ్మకు కాష్టం పేర్చి దహనం చేశారు. ఇల్లందకుంటలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. కమలాపూర్‌ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మను, కన్నూరులో ఈటల దిష్టిబొమ్మను దహనం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో, కామారె డ్డి జిల్లా నిజాంసాగర్‌లో జుక్క ల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆధ్వర్యంలో, ఖమ్మం జిల్లా మధిరలో దళిత సంఘాల నేతలు బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

మాట మార్చిన ఈటల

గ్యాస్‌ ధర విషయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్‌ మాటమార్చారు. పెరిగిన ధరలో రాష్ట్ర వాటా రూ.291 ఉంటుందని ఈటల పలుసార్లు పేర్కొన్నారు. రాష్ట్ర వాటా కేవలం జీఎస్టీ మాత్రమేనని.. అదీ రూ.50 దాటదని, ఒకవేళ రాష్ట్రం వాటా రూ.291 తీసుకొంటున్నట్టు నిరూపించాలని మంత్రి హరీశ్‌రావు ఈటలకు సవాల్‌ విసిరారు. తాను మాట్లాడింది తప్పని తెలుసుకున్న ఈటల కుక్కిన పేనులా ఉన్నారు. తాజాగా హుజూరాబాద్‌ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామంలో మంగళవారం ఈటల ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. పెంచిన గ్యాస్‌ ధరలపై మహిళలు నిలదీశారు. గ్యాస్‌ ధరకు ప్రపంచ మార్కెట్‌తో సంబంధం ఉంటుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధరతో సంబంధం లేదని ఈటల దాటవేశారు. ఈటల సమాధానంపై మహిళలు అసహనం వ్యక్తంచేశారు.

ఎన్ని కుట్రలు పన్నినా దళితబంధు ఆగదు

ఎవరెన్ని కుట్రలు పన్నినా దళితబంధు ఆగదు. సీఎం కేసీఆర్‌ ఆ పథకాన్ని కొనసాగించి తీరుతారు. ఆత్మగౌరవం పేరుతో ఈటల మరోసారి హుజూరాబాద్‌ ప్రజలను మోసం చేస్తున్నారు.
కొప్పుల ఈశ్వర్‌, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి

బీజేపీ భూస్థాపితమే

దళితులను ధనికులుగా మార్చాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ దళితబంధు అమలు చేస్తుంటే బీజేపీ పథకాన్ని నిలిపివేయించడం బాధాకరం. ఈసీకి లేఖ రాసి దళితబంధుకు అడ్డుపడిన బీజేపీ భూస్థాపితమే.
-ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌

దళితులు ఏకం కావాలి

దళితబంధును నిలిపివేయించడం దారుణం. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు దళితులంతా ఏకం కావాలి. దళితుల కడుపు కొట్టిన ఈటల, బీజేపీకి బుద్ధి చెప్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలి.
-అరూరి రమేశ్‌, ఎమ్మెల్యే

బీజేపీకి మూల్యం తప్పదు

దళితబంధు పథకంపై అక్కసుతో బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసి నిలిపివేసింది. దళితుల అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదు.

రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్యే

ఈటలను తరిమి కొట్టండి

దళితబంధును అడ్డుకున్న ఈటలను తరిమికొట్టాలి. దళితులు, దేవాలయ భూములను కబ్జా చేసిన ఈటల మరోసారి దళితుల నోట్లో మట్టికొట్టారు. ఎన్ని కుట్రలు పన్నినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్సే గెలుస్తుంది.
-మోత్కుపల్లి నర్సింహులు, టీఆర్‌ఎస్‌ నేత

దళిత వ్యతిరేక బీజేపీని ఓడించాలి

దళిత వ్యతిరేకి బీజేపీ పార్టీని హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మట్టి కరిపించాలి. దళితులను చదువుకు దూరం చేసింది బీజేపీయే. అలాంటి పార్టీలో చేరిన ఈటలకు దళితుల ఓటు అడిగే అర్హత లేదు. ఈటల స్వార్థం కోసం దళితులను బలి పశువులను చేస్తున్నారు. ఇప్పటికైనా దళితబంధును కొనసాగించాలని ఈసీకి ఈటల లేఖ రాయాలి. లేనిపక్షంలో దళిత వాడలకు ఓట్ల కోసం వస్తే అడ్డుకుంటాం.

వంగపల్లి శ్రీనివాస్‌, టీఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement