హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి రెండు వేల కుటుంబాల చొప్పున దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏటా రెండుమూడు లక్షల కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. జనగామలో బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ మార్చి తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధును అమలుచేస్తామని చెప్పారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ధనిక రాష్ట్రం అయితం, అందరం బాగుపడుతం, అందరం మంచిగుంటం అని ఉద్యమ సమయంలో చెప్పిన.
నేను చెప్పింది వందకు వందశాతం జరుగుతున్నది. ఇట్లనే మన దళితులు కూడా బాగుపడాలె. వాళ్ల పేదరికం పోకపోతే మనకే మంచిగుండదు. శరీరంలో ఏ ఒక్క భాగం బాగా లేకున్నా శరీరం బాగున్నట్టు కాదు. దళితబంధును చూసి బయట చాలామంది కండ్లు మండుతున్నయ్. ఈసారి సుమారు 40 వేల కుటుంబాలకు దళితబంధు ఇస్తున్నం. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నయ్. ఏటా రెండుమూడు లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తం. దళితబంధులో రూ.10 లక్షలు ఇవ్వడమే కాదు.. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, దవాఖానలు, హాస్టళ్లకు సరఫరా చేసే సామగ్రి, ప్రభుత్వ కాంట్రాక్టులు, వైన్స్, బార్లలో రిజర్వేషన్లు పెట్టినం. ఇంతకు ముందు ఏ దళిత సోదరుడికి వైన్స్, బార్ షాపులు లేకుండె. ఇయ్యాల దర్జాగా కాలుమీద కాలేసుకొని 260 మంది బార్లు, వైన్స్ నడుపుతున్నరు. ఈ రకమైన దళితులు దేశంలోనే ఎక్కడా లేరు’ అని సీఎం స్పష్టంచేశారు.