మంథని, సెప్టెంబర్ 1: దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సర్కారు తెచ్చిన దళితబంధును అడ్డుకుంటే సహించబోమని లబ్ధిదారులు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. అనర్హులకు పథకాలు ఇచ్చారని మంథని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. శ్రీధర్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు పార్టీలకతీతంగా దళితబంధు కింద రూ.10 లక్షల సాయం చేస్తున్నదని తెలిపారు. ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న వారు.. తమ ఇండ్లకు వచ్చి చూస్తే అర్హులమో కాదో తెలుస్తుందని అన్నారు. అధికారులు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని వారు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తూ గొప్ప పథకాన్ని నిలిపివేయించేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. లేదంటే తగిన సమయంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు బడికెల సతీశ్, కాశిపేట సమ్మయ్య, చంద్రశేఖర్, వెల్పుల శ్రావణ్, వెంకటేశ్, పీక మల్లయ్య, చెన్నూరి అశోక్, బూడిద వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.