హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాడు, బీజేపీ నేత చక్రధర్‌గౌడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొన్నది. సైబర్ మోసాలు చేసేందుకు చక్రధర్‌గౌడ్‌కు సిమ్‌లు సరఫరా చేసిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోసం చేసిన డబ్బులను ఎయిర్టెల్ వ్యాలెట్ నుంచి నగరంలోని ఐదు పెట్రోల్ బంక్‌లకు మళ్లించి, వాళ్లకు 3 శాతం కమిషన్ ఇచ్చి, మోసం డబ్బును వైట్‌మనీగా మార్చినట్టు పోలీసులు నిర్ధారించారు. పెట్రోల్ బంక్‌ల నిర్వాహకులకు నోటీసులు పంపించారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్, అతని బావమరిది గణేష్, మరో బంధువు శ్రావణ్‌తోపాటు వీరబాబును సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురిని 4 రోజుల కస్టడీలోకి తీసుకొని విచారించి, పలు విషయాలను పోలీసులు బయటకు తెచ్చారు. 2017 నుంచి చక్రధర్‌గౌడ్ సైబర్‌మోసాలు చేయడంపై దృష్టి సారించినట్టు ఇటీవల విచారణలో వెల్లడయ్యింది. కరోనా సమయంలో వీళ్లకు సైబర్‌మోసాలు కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే 2021లో పంజాగుట్టలో లక్ష్మణ్‌రావుకు చెందిన ఇంటిని రూ. 1.3 లక్షలకు కిరాయికి తీసుకొని, సైబర్ మోసాలను ప్రారంభించారు. మోసం చేసిన డబ్బును వైట్‌గా మార్చేందుకు ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దాని బ్యాంకు ఖాతాను బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకులో తెరిచారు. పలు జాబ్ పోర్టల్స్ నుంచి డాటాను కొనుగోలు చేసి, ఆన్లైన్లోనే ఉద్యోగులు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. కేరళ, తమిళనాడు, ఏపీకి చెందిన పలువురిని ఉద్యోగాల్లోకి తీసుకొన్నారు. వాళ్లకు ఉద్యోగంతోపాటు భోజనం, వసతి కల్పించి, వారిద్వారా మరింత మంది ఉద్యోగులను జాయిన్ చేసుకొన్నారు. వీరంతా డాటా ఎంట్రీ, ఇతర జాబ్‌లు ఇస్తామంటూ అమాయకులను నమ్మిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేసి,
ఆ తర్వాత సిమ్‌కార్డులను ధ్వంసం చేసేవారు.అమాయకుల పేర్లతో సిమ్‌కార్డులు
అనంతపురం జిల్లా బుక్కపట్నానికి చెందిన రమేశ్, ఫయాజ్ సిమ్‌కార్డులు విక్రయించేవారు. వీళ్లకు కృష్ణమూర్తి పరిచయం అయ్యాడు. తనకు నెలకు 30 నుంచి 40 సిమ్‌కార్డులు అవసరముంటాయని, అయితే అవి యాక్టివేట్ అయి ఎయిర్టెల్ బ్యాంక్‌కు లింక్ చేసిన తర్వాతే తీసుకొంటానంటూ ఒప్పందం చేసుకొన్నాడు. దీంతో రమేశ్, ఫయాజ్ గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ అమాయకుల పేర్లతో సిమ్‌కార్డులు తీసుకొని, కేవైసీ పూర్తి చేసి కృష్ణమూర్తికి అందించేవారు. కృష్ణమూర్తి వాటిని అనంతపురం నుంచి హైదరాబాద్‌లోని చక్రధర్‌గౌడ్‌కు పంపించేవాడు. ఇలా చక్రధర్‌గౌడ్‌కు 30 నుంచి 40 రోజుల వ్యవధిలోనే ఎప్పటికప్పుడు కొత్త సిమ్‌కార్డులు అందేవి. ఈ సిమ్‌కార్డు వ్యాలెట్లలోకి నిరుద్యోగ యువతను డబ్బులు పంపించాలని చక్రధర్‌గౌడ్ వద్ద పని చేసే టెలీకాలర్స్ సూచించేవారు. అలా వచ్చిన డబ్బులను పెట్రోల్ బంక్ ఖాతాలకు మళ్లించి, అక్కడి నుంచి డబ్బులు తీసుకొనేవారు. కాగా, కృష్ణమూర్తికి సిమ్‌కార్డులు అందించిన వారిపై కూడా పోలీసులు దృష్టిపెట్టారు.
ఆ పెట్రోల్ బంక్‌లు ఇవే..
శివశక్తి ఫ్యూయల్ స్టేషన్ (బీపీసీఎల్ డీలర్స్), భారత్ పెట్రోలియం, మూసాపేట్ (యజమాని నితేశ్), సాయి పెట్రోలియం ఎంటర్ప్రైజెస్ (హెచ్‌పీ పెట్రోలియం), కూకట్పల్లి (యజమాని మంజుషా), ఐఎస్ఆర్ ఫిల్లింగ్ స్టేషన్(ఇండియన్ అయిల్ కార్పొరేషన్ లిమిటెడ్), కూకట్పల్లి (యజమాని ప్రశాంత్), టీ అండ్ టీ ఎంటర్ప్రైజెస్ (హెచ్‌పీ పెట్రోలియం), పాపరాయుడునగర్, కూకట్పల్లి (యజమాని అనిల్), శివానిచౌదరీ ఫిల్లింగ్ స్టేషన్ (ఐఓసీఎల్), ముబరాసపూర్, గజ్వేల్ (యజమాని వేణుగోపాల్‌రావు) బంక్‌ల నిర్వాహకులు, సిబ్బందికి పోలీసులు నోటీసులు అందించారు. వారినుంచి వివరాలు సేకరించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే చక్రధర్‌గౌడ్ రూ.50 లక్షల వరకు ఈ బంక్‌ల నుంచి నగదు తీసుకొన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఎప్పటికప్పుడు కొత్తవారిని ఎంచుకొంటూ డబ్బులు బదిలీ చేశాడా? లేదా ఈ ఆరు బంక్‌లకు సంబంధించిన వాళ్లతోనే గత మూడేండ్లుగా లావాదేవీలు నిర్వహిస్తున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు ఆయా బంక్‌లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి సేకరించిన ల్యాప్‌టాప్‌లో ఎప్పటికప్పుడు ఈ మోసానికి సంబంధించిన ఆధారాలను తొలగించేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి పూర్తి బ్యాక్అప్ను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.