హనుమకొండ, మే 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభు త్వం.. ఈ పంటలను సాగు చేస్తున్న రైతులపై భారం మోపుతున్నది. విద్యుత్తు తక్కువ వినియోగం.. కూలీ సమస్య లేకుండా ఉద్యాన పంటలు సాగు చేసే డ్రిప్, స్ప్రింక్లర్ల సబ్సిడీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. దీంతో కూరగాయలు, పండ్లు, పూల సాగు మరింత భారంగా మారింది. ఎరువులు, పురుగుమందుల ధరలతో ఈ పంటలు సాగు రైతులకు గిట్టుబాటు కావడంలేదు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలు సాగు చేసే వారిపై మరింత భారం వేసింది. ఉద్యాన పంటల సాగుకు ఎక్కువగా వినియోగించే డ్రిప్, స్ప్రింక్లర్ల సాగుపై సబ్సిడీని భారీగా తగ్గించింది. రైతులే భరించేలా పథకంలో మార్పు లు చేసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గించడంతోపాటు కంపెనీలు పరికరాల ధరలను పెంచా యి.
రెండు రకాలుగా రైతులపై భారం పడిం ది. డ్రిప్, స్ప్రింక్లర్ల పద్ధతితోనే కూరగాయలు, పండ్లు, పూల సాగు లాభదాయకంగా ఉం టుంది. కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభు త్వం 60% నిధులతో ఈ పంటలకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ జరుగుతున్నది. రైతు లు 10% చెల్లిస్తే సరిపోయేది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీకి కోత పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాను 50 శాతానికి తగ్గించి రైతు వాటాను 20 శాతానికి పెంచింది. గతంలో ఎకరానికి డ్రిప్ వ్యవస్థ ఏర్పాటుకు రైతులు రూ.17 వేలు చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు రైతులు చెల్లించే మొత్తం ఏకంగా రూ.34 వేలకు పెరిగింది. డ్రిప్ ఇరిగేషన్లో రైతుల వాటాను రెట్టింపు చేయడంతో కూరగాయలు, పండ్లు, పూల సాగు బాగా తగ్గిపోయే ప్రమాదం నెలకొన్నది. డ్రిప్, స్ప్రింక్లర్ల సాగు పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ ఉండేది. తాజా గా ఈ వర్గాలకు, ఇతర రైతుల తరహాలోనే 80% సబ్సిడీ నిర్ణయించింది.
డ్రిప్ ఎరువులూ భారమే..
డ్రిప్ సాగు పరికరాలపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ తగ్గించడంతోపాటు కంపెనీలు ధరలు భారీగా పెంచాయి. డ్రిప్ పరికరాల భారానికి తోడు ఈ సాగుకు వినియోగించే ఎరువుల ధరలను సైతం కంపెనీలు భారీగా పెంచాయి. డ్రిప్ సాగులో ఎరువుల వినియోగం విభిన్నం గా ఉంటుంది. ఈ ఎరువుల ధరలు సైతం పెరిగాయి. రూ.5,400 ధర ఉండే 25 కిలోల 20-20-20 బస్తా ధర రూ. 5,900కి పెరిగింది. రూ.6,800 ఉండే 12-61-0 బస్తా ధర రూ.7,500 అయింది. రూ.5,900 ఉండే 13-0-45బస్తా ధర రూ.6,300లకు, రూ. 7,300 ఉండే 0-52-34 ఎరువు ధర ఏకం గా 8,600కు, క్యాల్షియం 25 కిలోల బస్తా రూ.2,800 నుంచి రూ.3,400కి పెరిగింది.
వందల కోట్ల భారం
రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిలో 6 లక్షల ఎకరాల్లోని పంటలకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఉన్నది. ప్రజల అవసరాలు, రైతులకు లాభదాయకంగా ఉండటంతో ఉద్యాన పంటల విస్తీర్ణం ఏటా పెరుగుతున్నది. ఉద్యాన పంటలు సాగు చేసే 1.20 లక్షల మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ పథకం మంజూరు చేస్తే మరో 3.50 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసే వారికి సబ్సిడీ తగ్గించడంతో రైతులపై భారం పెరుగనున్నది. ప్రభుత్వం సబ్సిడీ తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం మంజూరు కానున్న రైతులపై అదనంగా రూ.595 కోట్ల భారం పడనున్నది.