హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులందరూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని, పేదలకు పారదర్శకంగా సేవలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ప్రకారం పనిచేస్తూ, అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. కార్యదీక్షతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 122 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినందుకు బీఆర్కే భవన్లో తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ గురువారం సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూటర్ సిల్స్‌పై శిక్షణ ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని జీఏడీకి సూచించారు. ప్రమోషన్లు కల్పించినందుకు సీఎం కేసీఆర్, సీఎస్‌కు అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.