హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): బ్లాక్ మారెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి అభినందించారు. రాబోయే మూడు వారాల పాటు ఇదేవిధంగా నిఘా కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్యాక్ చేసిన విత్తనాలను కొనుగోలు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు సీజన్ ముగిసే వరకు విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను భద్ర పరుచుకునేలా చూడాలని తద్వారా అవసరమైతే నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుందని సీఎస్ సూచించారు.
కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థాయి వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి రైతులకు సక్రమంగా అందేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణీత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ఒక జత సూల్ యూనిఫాం విద్యార్థులకు అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. కాన్ఫరెన్స్లో డీజీపీ రవిగుప్తా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.