హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపైనే కాకుండా వాటి పరిధిలోని అన్ని ఔట్లెట్లపై సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి హక్కులను కాపాడాలని, ఆ రాష్ట్రంలోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కార్యాలయాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయవాడలోనే పెట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సమాఖ్య ప్రతినిధులతో కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్ కుమార్‌ను ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
కృష్ణా జలాలను 50ః50 నిష్పత్తిలో వినియోగించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం తగదని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తున్నదని ధ్వజమెత్తారు. దానివల్ల కృష్ణా బేసిన్‌లోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతోపాటు జల వనరుల శాఖ అధికారులకూ ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని గోదావరి బేసిన్‌కు ఆవల ఉన్న విశాఖపట్నంలో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు 400 కి.మీ, ఎన్ఎస్పీకి 700 కి.మీ, శ్రీశైలానికి 800 కి.మీ. దూరంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సహేతుకం కాదని, విజయవాడలో ఏర్పాటు చేయడమే అన్నివిధాలా సముచితమని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమాఖ్య కార్యవర్గ సభ్యులు గుడిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.