తాడ్వాయి, అక్టోబర్ 8 : విధులు నిర్వర్తించేందుకు వెళ్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనాలను ఇసుక లారీ అతివేగంగా ఢీ కొట్టడంతో జవాన్ మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఎన్‌హెచ్ 163పై గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏటూరునాగారం నుంచి ములుగు వైపు సీఆర్పీఎఫ్ పోలీసులు డీసీఎం వ్యానులో, ప్రభుత్వ ఉద్యోగులు కారులో విధులకు బయలుదేరారు.
పస్రా సమీపంలోని బ్లాక్‌బెర్రీ ఐలాండ్ వద్దకు చేరుకోగానే హనుమకొండ నుంచి ఇసుక లోడింగ్ కోసం ఏటూరునాగారం వైపునకు వస్తున్న లారీ అతివేగంతో ఎదురుగా వస్తున్న డీసీఎంను, దాని వెనుకే ఉన్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న కరీంనగర్ జిల్లా వడుకాపూర్ 39వ బెటాలియన్ కానిస్టేబుల్ ముగురమ్ రమాకాంత్ (45) అక్కడిక్కడే మృతిచెందగా, గిరీశ్‌కుమార్, ప్రేమ్ప్రకాశ్, రామ్జన్ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి.
కారులో ప్రయాణిస్తున్న గోవిందరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్డీ సఫియా, తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న ఫాల్తియా రమేశ్‌తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. వీరిని హనుమకొండలోని దవాఖానకు తరలించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై జగదీశ్ తెలిపారు.