ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 11: ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగానికి ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి రూ.కోటి అయిదు లక్షలు విరాళంగా ఇచ్చారు. విద్యార్థిగా ఆయన ఈ విభాగంలోనే ఎమ్మెస్సీ పూర్తి చేశారు. విరాళం చెక్కును ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కెమిస్ట్రీ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్, ఓయూసీఎఫ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఏ రెడ్డికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జీవిత లక్ష్యాలను చేరుకోవడంలో ఓయూ కెమిస్ట్రీ విభాగం పాత్ర ఎంతో ఉన్నదని అన్నారు. పూర్వ విద్యార్థులంతా ముందుకొచ్చి కెమిస్ట్రీ విభాగం అభ్యున్నతికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. వర్సిటీ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమవంతు తోడ్పాటు అందించడం ప్రశంసనీయమని ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ అన్నారు. ఓయూ పూర్వ విద్యార్థుల సహకారంతో నాణ్యమైన బోధన, పరిశోధన, ల్యాబ్‌ల ఆధునీకరణకు చేసేందుకు ఓయూ కెమిస్ట్రీ ఫౌండేషన్ (ఓయూసీఎఫ్)ను గతంలోనే నెలకొల్పారు. ఎంఎస్ఎన్ రెడ్డి ఇచ్చిన విరాళం సొమ్మును మౌలిక వసతుల కల్పన, విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వినియోగించనున్నారు.