80 రకాల వృక్ష జాతులు, 206 రకా ల మూలికలు, 56 జాతుల పొద లు.. ఇలా 313 జాతులకు చెందిన 439 రకాల అరుదైన వృక్ష సంపద
పదహారు రకాల అరుదైన క్షీరదాలు, 139 రకాల పక్షి జాతులు, 151 జాతులకు చెందిన అకశేరుకాలు.. ఇలా 348 జాతులకు చెందిన జీవరాశులు
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): అడవుల్లో తప్ప ఇంతటి జీవవైవిధ్యం బయ ట ఎక్కడా కనిపించదు. కానీ, హైదరాబాద్‌లోనూ ఇవన్నీ కలగలిసి ఉన్న కేంద్రం ఒకటి ఉన్నదని తెలిస్తే మాత్రం ఆశ్చర్యం అనిపించకమానదు. వ్యవసాయ పరిశోధకులు, విద్యార్థులకు లైవ్ ల్యాబరేటరీగా మారిన ఈ వనం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్యాలయం పరిధిలో ఉన్నది. అలాగని ఇది సహజసిద్ధంగా ఏర్పడిందనుకుంటే పొరపా టే. ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు దశాబ్దాలుగా చేసి న కృషి ఫలితంగా ఈ ఆగ్రో ఫారెస్ట్రీ, అగ్రి బయోడైవర్సిటీ పార్క్ సాక్షాత్కారమైంది. ఇంతటి జీవవైవిధ్యం కలిగిన ఈ ప్రాంతం ఇప్పుడు కనుమరుగు కాబోతున్నదనే వార్త ఆందోళన కలిగిస్తున్నది. ఈ భూముల్లో హైకోర్టు నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదిస్తుండడం శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురిచేస్తున్నది.
రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలో 70-80 ఎకరాల పరిధిలో ఆగ్రో ఫారెస్ట్రీ ఉంది. 1987లో ఒక పరిశోధన ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలో మరో 130 ఎకరాల్లో అగ్రి బయోడైవర్సిటీ పార్కు ఉంది. 2010లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య దీనిని ప్రారంభించారు. వైవిధ్యమైన వృక్షజాతులు, పక్షులు, కీటకాలు సహా అత్యంత అరుదైన జీవజాతులకు ఇది నిలయంగా మారింది. ఏండ్ల తరబడి వాటికి అనువైన పరిస్థితులు కల్పించడం వల్లే ఇవన్నీ ఇక్కడ వృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హైకోర్టుకు నూతన భవన సముదాయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన కేసీఆర్ ప్రభుత్వం నుంచీ ఉంది. ఇందుకోసం బుద్వేల్‌లో 180 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను కాదని తాజాగా ఆగ్రో ఫారెస్ట్రీ డివిజన్, బయో డైవర్సిటీ పార్కు ఉన్న భూముల్లో నిర్మించాలని యోచిస్తున్నది. ఈ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల అసోసియేషన్ (టాసా)తోపాటు బోధనేతర సిబ్బంది అసోసియేషన్ అదేరోజు న్యాయమూర్తులను కలిసి తమ ఆందోళనను వివరించింది. జీవ వైవిధ్యానికి నిలయమైన ఈ ప్రాంతాన్ని వదిలేసి మరెక్కడైనా హైకోర్టును నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.