హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ రవిగుప్తా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత, రైల్వేల విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లలో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారుల వెంట రోడ్ సేఫ్టీ క్లబ్బులు ఏర్పాటు చేయాలని, జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ల పరిధిలో కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరోలను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మాసంగా పాటిస్తున్నదని, ఈ నెల రోజులు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
రోడ్డు ప్రమాదం లో ఎకువగా యువత చనిపోతున్నందున ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ విభాగాల ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని సూచించారు. వాహనాల సంఖ్య పెరుగుతుండటం, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, అతి వేగం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని వివరించారు.
ఈ-చలాన్ల ద్వారా వచ్చే నిధులతో స్పీడ్ గన్లు, బ్రీత్ అనలైజర్ల వంటి పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ప్రాణాలను కాపాడే వారిని ‘గుడ్ సమారిటన్’ పేరిట సన్మానించాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాశ్, రోడ్డు భద్రత అడిషనల్ డీజీపీ మహేశ్ భాగవత్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ పాల్గొన్నారు.