ఖమ్మం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వైఎస్ షర్మిల ముమ్మాటికీ బీజేపీ వదిలిన బాణమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆమె మాటతీరు, టీఆర్ఎస్పై చేస్తున్న విమర్శలను గమనిస్తున్న వారికి ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. గురువారం ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన్, జాతీయ నాయకుడు చంద్రంతో కలిసి తమ్మినేని మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నిఘా, దర్యాప్తు సంస్థలు దేశ వ్యాప్తంగా కేవలం ప్రతిపక్ష నేతలపైనే దృష్టి సారిస్తున్నాయని ఆరోపించారు.
ఈడీ, ఐటీ సంస్థలతో బీజేపీయే దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించడం వెనుక కూడా బీజేపీ హస్తం ఉన్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల కోసం బీజేపీ ఓ బాధ్యుడినే కేటాయించడం దారుణమని అన్నారు. ఒకటిరెండు రాష్ర్టాల్లో, కొన్ని ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తామే అధికారంలోకి వస్తామని కలలు కనడం బీజేపీ అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రం గాలికొదిలేసిందని ఆరోపించారు. అసంఘటితరంగ కార్మికులు, ధరణి సమస్యలపై తాము చేసిన విజ్ఞప్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నదని తెలిపారు.