CPI Koonamneni | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో దేశంలోని న్యాయవ్యవస్థ బందీ అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నరోదాగావ్ ఊచకోతకు పాల్పడినవారు సైతం నిర్దోషులుగా బయటకు రావడంతో న్యాయస్థానాల తీర్పు అనేక ప్రశ్నలకు తావిస్తున్నదని అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గుజరాత్లో 98 మందిని ఊచకోత కోసిన వారిని నిర్దోషులుగా విడుదల చేశారన్నారు. 11 మంది సజీవ దహనం కేసులో గుజరాత్ కోర్టు నిందితులను విడుదల చేసిందని, ఈ సందర్భంలో వీరిని ఎవరు చంపారన్న న్యాయవాది ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితి నెలకొన్నదన్నారు. పలు నేరాలతో సంబంధం ఉన్నా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా న్యాయస్థానానికి వచ్చి సాక్షిగా చెప్పడాన్ని కూనంనేని తప్పుపట్టారు.
గుజరాత్ మోడల్ పాలన అంటే ఏమిటో అనుకున్నామని, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడమని ఇప్పుడు రుజువైందని కూనంనేని ఎద్దేవా చేశారు. బిల్కిస్ భాను కేసులో ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించారని, బీజేపీ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ లేదన్నారు. న్యాయవ్యవస్థకు రాజకీయ జాఢ్యం పట్టడం అత్యంత ప్రమాదకరమన్నారు.
బీజేపీ పక్కన నిలిస్తే తప్పుచేసినా ఫర్వాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ శ్రీరాముడితోపాటు గాడ్సే బొమ్మను పక్కనబెట్టి ఊరేగింపు చేసినా చర్యలు తీసుకోకపోవడం బీజేపీ తీరును తెలియజేస్తుందని కూనంనేని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న బీజేపీని ఓడించకపోతే దేశ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు త్యాగాలతో నిర్మితమైన విశాఖ ఉక్కును అదానీకి కట్టబెట్టాలని ప్రధాని మోదీ సారధ్యంలోని సర్కార్ నిబంధనలు రూపొందించిందని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించేవారిని, బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగిపోయిందని అడ్డదిడ్డంగా సంపాదించిన కొంతమంది డబ్బుతో రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని కూనంనేని మండిపడ్డారు. రూపాయి ఖర్చు లేకుండా మీరు ఎక్కడైనా గెలువగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీగేటు తాకనివ్వకపోవడం ఎవరి చేతిలో లేదని ప్రజా విశ్వాసం ఉంటే అది నెరవేరుతుందన్నారు. కమ్యూనిస్టులుగా ఖమ్మం జిల్లా నుంచి ఈ దఫా అసెంబ్లీలో అడుగుపెడతామని స్పష్టం చేశారు. ధనబలం కంటే జనబలం ప్రధానమని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు ఐక్యమై గెలుపు ఓటములను శాసించబోతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం త్వరలో సీఎం కేసీఆర్కు లెఫ్ట్ పార్టీలు లేఖ రాయనున్నట్లు తెలిపారు.