హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కంటే ముందుగా హంద్రీనీవా, వంశధార ప్రాజెక్టులను పూర్తిచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు. శనివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సముద్రంలోకి వృథాగా పోయే జలాలను వినియోగించుకోవడం మంచి నిర్ణయమే అని పేర్కొన్నారు. అయితే, గోదావరి జలాల విషయంలో తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను సీపీఐ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రెండు రాష్ర్టాలుగా విడిపోయినంత మాత్రాన తెలుగువారు శత్రువులు కాదని, ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు ఉభయ రాష్ర్టాలకూ మంచిది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు.