హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): సినిమా రంగ కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాలకు 30%, చిన్న చిత్రాలకు 15% వేతనాలు పెంచాలని స్పష్టంచేశారు. వారికి న్యాయం జరిగేవరకు సీపీఐ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని సినిమా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు.
తెలుగు సినిమా కార్మికులు తమకు వేతనాలు పెంచమంటే ముంబై నుంచి కార్మికులను తీసుకువచ్చి పని చేయించుకుంటామని నిర్మాతలు బెదిరింపులకు పాల్పడటం సరికాదని మండిపడ్డారు. ఇకడి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సీపీఐ ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. చిరంజీవిని ఉద్దేశించి నిరుడు తాను చేసిన వ్యాఖ్యలపై అప్పుడే క్షమాపణలు చెప్పడంతో ఈ ఆంశం ముగిసిపోయిందని, కానీ చిరంజీవి మళ్లీ ఆ ప్రస్తావన తేవడం, ఆ వీడియోలు వైరల్ చేయడం సబబు కాదని అన్నారు. ఈ అంశాన్ని చిరంజీవి విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు నారాయణ పేరొన్నారు.