హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(పీజీ) ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్)-2025 నోటిఫికేషన్ విడుదలయ్యింది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీపీగెట్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 297 కాలేజీలున్నాయి. వీటిల్లో పీజీ కోర్సులతోపాటు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులున్నాయి. ఆయా కోర్సుల్లోని సీట్లను సీపీగెట్ ద్వారా భర్తీచేస్తారు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీల్లోని సీట్లను నింపుతారు. ఈసారి నుంచి కొత్తగూడెంలో ఏర్పాటు చేసే ఎర్త్‌సైన్స్ వర్సిటీలోని సీట్లను సైతం సీపీగెట్ ద్వారానే భర్తీచేస్తారు. మొత్తం మూడు విడతల్లో సీట్లు భర్తీచేసే అవకాశమున్నది.
ఏపీ కోటా కట్..
ఉమ్మడి రాష్ట్ర ప్రవేశాల గడువు ముగియడంతో ఈ సారి ఏపీ కోటా సీట్లకు కోతపెట్టారు. ఇది వరకు 15% సీట్లుండగా, ఇక నుంచి ఏపీ విద్యార్థులు అదర్స్టేట్ కోటాలో పోటీపడాల్సి ఉంటుంది. ఈ సారి నుంచి దివ్యాంగులకు ఐదుశాతం రిజర్వేషన్ వర్తింపజేస్తారు.
సగం సీట్లు కూడా నిండట్లే
రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో సగానికి పైగా సీట్లు నిండటం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నది. నిరుడు కేవలం 46.12% సీట్లు మాత్రమే నిండాయి. దాదాపు 54% సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 46,742 సీట్లుంటే నిరుడు 21,560 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. క్యాంపస్, కాన్స్టియంట్ కాలేజీల్లో 9,530 సీట్లకు 8,087 సీట్లు నిండాయి. ప్రభుత్వ పీజీ కాలేజీల్లో 9,570 సీట్లకు 4,518 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక అఫిలియేటెడ్ కాలేజీల్లో 35,002 సీట్లకు కేవలం 12,643 సీట్లు మాత్రమే నిండాయి.