హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఓ దంపతులు తమ ఇంటిని విరాళంగా రాసిచ్చి భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని వసంతపురం కాలనీకి చెందిన టీ కనకదుర్గాప్రసాద్, సునీతాదేవి దంపతులకు సంతానం లేదు. దీంతో తమ తదనంతరం 250 గజాల స్థలంలోని ఇల్లు శ్రీవారికి చెందేలా వీలునామా రాశారు. ఈ మేరకు ఆస్తి పత్రాలను మంగళవారం టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు. ఇటీవల వనస్థలిపురానికి చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మరణానంతరం తన ఆస్తిని టీటీడీకి రాసిచ్చిన దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వెల్లడించారు.