హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ఖలీల్‌వాడి/ నిజామాబాద్ క్రైం: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) మేడ్చల్ అధికారులు శనివారం కూకట్‌పల్లిలో నకిలీ మందుల తయారీ రాకెట్‌ను ఛేదించారు. మూసాపేటలో రామ్స్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో కొనసాగుతున్న ఈ కంపెనీ డ్రగ్ లైసెన్సులు లేకుండానే పంజాబ్‌కు చెందిన కంపెనీ పేరుతో నకిలీ యాంటీ అల్సర్ మందులను తయారు చేస్తున్నది. కౌచిక రంజిత్‌కుమార్, మాడా పవన్, షేక్ సుభానీ తదితరులు మూసాపేట రాజీవ్‌గాంధీనగర్‌లోని రామ్స్ ఫార్మాస్యూటికల్స్‌లో ఈ నకిలీ మందులను తయారుచేస్తున్నట్టు డీసీఏ అధికారులు తెలిపారు.
తమకు అందిన సమాచారంతో శనివారం ఆకస్మిక తనిఖీలు చేయగా, నకిలీ మందుల తయారీ బాగోతం బయటపడినట్టు చెప్పారు. ఫుడ్ లైసెన్సుతో నకిలీ మందులను తయారుచేస్తున్నట్టు పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నకిలీ మందులను, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రొడక్షన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న షేక్ సుభానీని ప్రశ్నించగా, నకిలీ మందులను నిజామాబాద్ వినాయక్‌నగర్ పరిధి శ్రీనగర్‌కాలనీలో బయోమెట్రిక్ ఫార్మాసిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటుచేసిన ఏజెన్సీకి సరఫరా చేస్తున్నట్టు తెలిపినట్టు వెల్లడించారు. నిజామాబాద్‌లోని డీసీఏ అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఏజెన్సీపై దాడులు నిర్వహించి రూ.6 లక్షల విలువైన 29,600 నకిలీ మందుల క్యాప్సుల్స్‌ను సీజ్ చేసినట్టు తెలిపారు. నకిలీ మందులు విక్రయిస్తున్న ఏజెన్సీ డైరెక్టర్ కే రజిత్కుమార్పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు.