హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఎలిమినేటి మాధవరెడ్డి (ఎస్ఎల్బీసీ) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో 5వ మోటర్‌ను తక్షణం అమర్చాలని, తద్వారా 3.2 లక్షల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఈమేరకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మండలి చైర్మన్ గుత్తా బుధవారం ప్రత్యేకంగా లేఖ రాశారు.
ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం నాలుగు పంపులే ఉన్నాయని, వాటిద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని నిత్యం ఎత్తిపోస్తున్నట్టు వివరించారు. అయితే, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 530 అడుగులకు పడిపోయిన సందర్భంలో నీటి డిశ్చార్జి 1,800 క్యూసెక్కులకు తగ్గిపోతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయసముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు, ఏఎమార్పీ ఆయకట్టుకు సాగునీరు అందడం కష్టతరంగా మారిందని తెలిపారు.