ఎదులాపురం, జనవరి 12 : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదిలాబాద్‌లో రైతులు నిరసనకు దిగారు. సీసీఐ ద్వారా క్వింటాల్ పత్తిని రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రైతు జేఏసీ చైర్మన్ దారట్ల కిష్టులు మాట్లాడుతూ.. కమర్షియల్ కొనుగోలుకు సీసీఐకి అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శించారు.
అంతర్జాతీయంగా పత్తికి మంచి ధర ఉన్నా గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోవడంపై మండిపడ్డారు. పత్తి క్వింటాల్‌కు రూ.10 వేలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో రైతు సంఘాల నాయకులు బండి దత్తాత్రి, వేణుగోపాల్ యాదవ్, కుంటాల రాములు, విజ్జగిరి నారాయణ, సాయి పాల్గొన్నారు.