స్టేషన్‌ఘన్‌పూర్, ఏప్రిల్ 13 : ‘అందరు వరి పండించడం కాదు.. ఇతర పంటలు కూడా వేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబితే మక్కలు పండించాం.. ఇప్పుడు అదే పాపమైంది.. తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో కొనడానికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నరు. కాళ్లు మొక్కినా కనికరిస్తలేరు’ అని జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన రైతు లు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే సరైన ధర రాదని, పైసలు కూడా సమయానికి వస్తాయో.. రావోనని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రానికి వస్తే ఇక్కడ మార్క్‌ఫెడ్ వారు చుక్కలు చూపిస్తున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు.
మార్కెట్‌కు మక్కలు తీసుకొచ్చిన మూడు రోజులకు అవి పగిలాయని, కొనబోమని మార్క్‌ఫెడ్ వా రు మొండికేయడంతో తిరిగి రైతులు ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో మక్కల రవాణా ఖర్చులు వృథా అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మక్కలు కొనుగోలు చేయాలంటూ ముందుగా రైతులు మార్కెట్లో బయోమెట్రిక్ చేయాలి. కానీ చాలామంది రైతులకు ఫింగర్ ప్రింట్స్ రాకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతుందని రైతులు చెప్తున్నారు. మక్క గింజలు పగిలాయని, ఫంగస్ ఉన్నదని వెనక్కి పంపించకుండా, గ్రేడ్ సిస్టమ్ పెట్టి కొంత తక్కువ ధరకైనా కొనాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొందరి రైతుల మక్కలు కాంటా పెట్టినా, లోడ్ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నెల 9న మక్కలు తీసుకొచ్చిన. 11న కాంటా అయింది. ఇప్పటిదాకా లోడ్ చేయలేదు. లోడ్ అయ్యేంత వరకు రైతుల బాధ్యత ఉంటుంది. ఉదయం 6 గంటలకు వచ్చి, రాత్రి 7 గంటల వరకు మక్కలు లోడ్ అవుతాయని ఆశతో ఎదురు చూస్తున్నా. ఎక్కడ వర్షం పడుతుందోనని భయంగా ఉన్నది.