హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు వంశీకృష్ణను చిత్రహింసలకు గురిచేసిన పోలీస్ అధికారులపై దాఖలైన అఫిడవిట్‌పై శుక్రవారం నాంపల్లి కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఆ అఫిడవిట్‌పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, కౌంటర్ దాఖలుకు అవకాశం కల్పించాలని కోర్టును కోరడంపై నిందితుడి తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటీసులు అందుకోకుండానే అఫిడవిట్‌పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేయడం చట్టవ్యతిరేకమని మండిపడ్డారు. వంశీకృష్ణను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించి, తీవ్రంగా హింసించిన ఏసీపీ, డీసీపీని కాపాడేందుకు పీపీ ప్రయత్నిస్తున్నట్టు గోచరిస్తున్నదని పేర్కొంటూ.. ఆ అధికారుల వేధింపులపై నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పట్టుపట్టారు. ఈ వాదనలపై 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్టేట్ సౌమ్య స్పందిస్తూ.. అఫిడవిట్‌పై పీపీ కౌంటర్ దాఖలు చేసినా అంగీకరించబోనని స్పష్టం చేశారు. పోలీసుల చిత్రహింసలపై ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేయాలని నిందితుడికి సూచిస్తూ.. వాంగ్మూలం నమోదుపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
రాధాకిషన్‌రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వాయిదా
ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రిటైర్డు డీసీపీ రాధాకిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత ప్రకటిస్తామని జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం ప్రకటించారు. ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారమే విచారణ ముగించి, తీర్పును వాయిదా వేసింది.