నల్లగొండ: నాగార్జునసాగర్ జలాశయానికి (Nagarjuna Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఎగువ నుంచి 2,56,453 క్యూసెక్కుల వరద వస్తుంగా, 2,96,522 క్యూసెక్కులు బయటకు వెళ్తున్నది. స్పిల్‌వే గేట్ల ద్వారా 2,78,520 క్యూసెక్కులు వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అండుగులు కాగా, ప్రస్తుతం 585.40 అడుగుల వద్ద ఉన్నది. మొత్తం నీటి నిల్వ 312.04 టీఎంసీలకుగాను 298.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
కాగా, సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో అధికారుల ప్రాజెక్టు పది గేట్లను మూడు మీటర్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2,51,259 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 171.028 అడుగులు. జలాశయం గరిష్ఠ నీటి నిలువ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 42.160 టీఎంసీలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 16,600 క్యూసెక్కులు, లీకేజీ ద్వారా 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.