భువనగిరి : ప్రభుత్వానికి రైతులు అందిస్తున్న సహకారం వల్లే నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు విజయవంతంగా పూర్తవుతున్నాయని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి (Mla Shekar Reddy) అన్నారు. రైతులు తమ భూములను ప్రభుత్వానికి అందజేసి త్యాగం చేయడం వల్లే నృసింహ సాగర్ రిజర్వాయర్ (Nrisimha Sagar Reservoir ) నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
నృసింహ సాగర్(బస్వాపూర్ రిజర్వాయర్) ముంపు గ్రామం బిఎన్ తిమ్మాపూర్ గ్రామస్థులకు పునరావాసం (Rehabilitation) కింద 1053 మందికి శుక్రవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో హుస్నాబాద్ వద్ద కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది రైతులు తమ భూములను రిజర్వాయర్ కోసం త్యాగం చేయడం అభినందనీయమని అన్నారు.
వారికి ఆయకట్టు పరిధిలోని రైతులు, ప్రజలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారి త్యాగం వల్లే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమవుతుందని వెల్లడించారు. మొత్తం 93 ఎకరాల భూమి లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల స్థలాలకు కేటాయించామని వివరించారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలను కేటాయించినందుకు రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.