హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 8 కార్యాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగతావన్నీ అద్దెభవనాల్లో, ఇరుకుగదుల్లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు, అధికారులు ఇబ్బందిపడేవారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.64 కోట్లతో 87 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 22 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 39 భవనాల పనులు తుదిదశకు చేరుకొన్నాయి. మరో 15 భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మిగతాచోట్ల కూడా నిర్మాణపనులు ప్రారంభించనున్నారు.