హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత హైబ్రీడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టు కేటాయింపుల్లో జిల్లాల మధ్య సమతుల్యత లోపించింది. సింహభాగం రోడ్లు ఆర్అండ్బీ మంత్రి ప్రా తినిధ్యం వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లాకే దక్కాయి. 10,000 కోట్లలో రూ. 2,000 కోట్లు ఆ ఒక్క జిల్లాకే మంజూరు చేయడం గమనార్హం. హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 32 ప్యాకేజీల కింద రూ. 10,54 7 కోట్లతో 5,566 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
రూ. 6,15 2కోట్లతో 1,791కి.మీ మేర రోడ్లను విస్తరించనుండగా, రూ. 4,395 కోట్లతో 3,775 కి.మీ మేర అప్గ్రేడ్ చేయనున్నారు. రోడ్ల ఎంపికలో పక్షపాతం చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 400 రోడ్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 66 రోడ్లు, అలాగే మరో మంత్రికి సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 47 రోడ్లు మంజూరు చేయడమే నిదర్శనమని చెప్తున్నారు. నల్లగొండ, యా దాద్రి భువనగిరి కలిపి రూ. 2,041.54 కోట్లతో 939 కి.మీ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో 1,298.76 కోట్లతో 680.89 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఆదిలాబాద్లో కేవలం 18, జయశంకర్ భూపాలపల్లిలో 11, కరీంనగర్లో 20, మంచిర్యాలలో 12, సిద్దిపేటలో 25, వనపర్తిలో 19 రోడ్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సిద్దిపేటలో కేవలం రూ. 392 కోట్లతో 25 రోడ్లు, కరీంనగర్లో రూ. 346 కోట్లతో 20 రోడ్లు, ఆదిలాబాద్లో రూ. 571 కోట్లతో 18 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అన్ని జిల్లాల్లో సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ రోడ్లుగా అభివృద్ధి చేయాల్సిన రోడ్లున్నాయి. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అలాగే మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హ్యామ్ రోడ్ల పనులను దశలవారీగా చేపడుతున్నామని, మొదటి దశలో కేవలం 32 ప్యాకేజీల కింద పనులు చేపడుతున్నట్టు ఆర్అండ్బీ అధికారులు పేర్కొన్నారు. ప్రాధాన్యాన్ని బట్టి రోడ్లను ఎంపికచేశామని, పక్షపాతం లేదని వివరించారు. మొదటి దశలో తక్కువ రోడ్లు చేపట్టిన జిల్లాల్లో రెండో దశలో అన్ని రోడ్లనూ కవర్ చేస్తామని వివరించారు.
