హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీ కమిటీని నియమించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పీఆర్సీ వర్తించేలా చర్యలు చేపట్టాలని కోరింది. జేఏసీ నేతలు సోమవారం సచివాలయంలో ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్మిట్టల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ కోల్ప్లాంట్, యాష్ప్లాంట్ టెండర్లపై ఉద్యోగులందరితో చర్చించి, సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని కోరారు. అవసరమైతే టెండర్ నిబంధనలు మార్చాలని పేర్కొన్నారు. రైతు డిస్కమ్ విషయంలోత్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాలని సూచించారు. జేఏసీ చైర్మన్ సీహెచ్ రమేశ్, కో చైర్మన్ పీ అంజయ్య, కన్వీనర్ ఎన్ శివాజీ, కో కన్వీనర్ నాజర్ షరీఫ్, ఫైనాన్స్ సెక్రటరీ వీ పరమేశ్ తదితరులు ఉన్నారు.