చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 7: పాతబస్తీలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్సై) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురిచేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన వివరాలను హుస్సేనీ ఆలం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్‌కు చెందిన బాలేశ్వర్ (48)కు భార్య, పిల్లలు ఉన్నారు. 1995 బ్యాచ్‌కు చెందిన బాలేశ్వర్ మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌లో ఆర్ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6న పాతబస్తీలో విధులు నిర్వహించేందుకు వచ్చాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆదివారం తెల్లవారుజామున గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బాలేశ్వర్ మరణించాడు. బాలేశ్వర్ దవడ కింది భాగం నుంచి రెండు రౌండ్ల బులెట్లు దూసుకెళ్లినట్టు గుర్తించారు. ఈ ఘటన జరిగిన వెంటనే దక్షిణ మండలం డీసీపీ పీ సాయి చైతన్య, చార్మినార్ ఏసీపీ, హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ సురేందర్ ఘటనా స్థలానికి చేరుకొని.. బాలేశ్వర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? గన్ మిస్ ఫైర్ అయిందా? కుటుంబంలో ఏమైనా కలహాలున్నాయా? ఆర్థిక, ఆరోగ్య సమస్యలేమైనా వెంటాడుతున్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అనంతరం బాలేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసును హుస్సేనీ ఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.