హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అనేక మంది శత్రువులు.. ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉంటారు. ఒకరికొకరు ప్రత్యర్థులుగానే కనిపిస్తారు. ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో ఉంటారు. ఈ అందరినీ ఆడించే సూత్రధారి ఒక్కరే. అందరి లక్ష్యమూ ఒక్కటే. ఇప్పుడిప్పుడే తెరపిన పడుతున్న తెలంగాణను ఆగం చేయాలె. తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఆగం చేయాలె.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టాలె.. తెలంగాణను కైవసం చేసుకొని.. మళ్లీ పాత రోజుల్లోకి నెట్టేయాలె. ముందుగా ప్రధాన సూత్రధారి ఒక ఉప ఎన్నిక తెచ్చి పడేస్తాడు. అప్పటిదాకా నిద్రాణంలో ఉన్న స్లీపర్ సెల్స్ అన్నీ ఒక్కసారిగా హైపర్ యాక్టివ్ అయిపోతాయి. ఎవరి పాత్రలో వారు లీనమైపోతారు. ఒకరు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి అయినా.. ఇక్కడ మాత్రం ఒక బలహీనమైన అభ్యర్థిని ఏరికోరి నిలబెడతారు. ఇంకొకరు ఒక పార్టీలో ఉండి.. పక్క పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు.
ఒక ప్రొఫెసర్ ఎన్నికలు రాంగనే తెలంగాణ ఏదో అయిపోయిందంటూ వలవల ఏడుస్తారు. వెకిలిగా మాట్లాడటమే తెలిసిన ఒక పాస్టర్.. ఎవరు టిక్కెట్ ఇస్తరా అని కాచుక్కూచున్న గాయకుడిని అమాంతంగా పట్టుకొని అభ్యర్థిగా నిలబెడతాడు. తెలంగాణలో ఆంధ్ర రాజన్న రాజ్యం తెస్తానని పాదయాత్రలు.. దీక్షల పేరుతో పది మందిని వెంటేసుకొని తిరిగే సమైక్యాంధ్ర వీరవనిత.. ఎన్నికల బరిలో అభ్యర్థినే దింపరు. చివరి నిమిషంలో తెలంగాణను ముప్పుతిప్పలు పెట్టి.. ముంచడానికి కుట్ర చేసిన మహానుభావుడిని సూత్రధారి రంగంలోకి దింపాలని ప్రయత్నించాడు. 2018లో చావుతప్పి పరారైన సదరు బాబు కూడా ముందు ఉత్సాహం చూపినప్పటికీ.. ప్రస్తుతానికి వద్దు అనుకొని వెనకడుగు వేశాడు. మొత్తం మీద ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. అందరూ రంగంలో ఉంటారు. అందరి టార్గెట్ తెలంగాణ ఓటర్లను చీల్చాలి. వెయ్యో, రెండువేలో తెలంగాణ ఓట్లు చీలిపోవాలి. తద్వారా తెలంగాణ ఇంటిపార్టీ ఆగమైపోవాలి. తెలంగాణ తెల్లబోవాలి.. సూత్రధారి గట్టెక్కాలి. ఇదీ టార్గెట్.
వైఎస్ షర్మిల: పక్కాగా బీజేపీ వదిలిన బాణం. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పదిమంది వందిమాగధ భజన గణాన్ని వెంటేసుకొని తిరుగుతుంటారు. పాపం ఎంత తిరుగుతున్నా ప్రజలు పట్టించుకొన్న పాపాన పోలేదు. అయినా బీజేపీ పలుకులను షర్మిల చిలుక వలె వల్లె వేస్తుంటారు. బీజేపీ డైరెక్షన్లో.. బీజేపీ ఆరోపణలతోనే ఢిల్లీకి వెళ్లి సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అవుతానని కలలు కంటున్న షర్మిలకు ఒక ఉప ఎన్నికలోనే అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితి. ఇక అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పేదేముంటుంది?
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: విద్యావంతులు సైతం బీజేపీ ఉచ్చులో పడుతారని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏడేండ్లపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంటుందో, సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎలాంటివో క్షుణ్ణంగా తెలుసు. అయినా పదవికి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరి.. బీజేపీ ‘బీ’ టీమ్‌గా మారిపోయారు. ఎంతసేపూ సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను విమర్శించడమే తప్ప కేంద్రంలోని బీజేపీ వైపు కన్నెత్తి చూడరు. మానవ హక్కులు హరిస్తున్నా, ప్రాణాలు తీస్తున్నా పల్లెత్తు మాట అనరు. ఇలాంటి కుట్రదారుల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన తరుణమిది. తస్మాత్ జాగ్రత్త.
రేవంత్‌రెడ్డి: పేరుకే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. కానీ.. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం. చీకటి ఒప్పందంలో భాగంగా సీనియర్ నేతలను తరు చూ అవమానిస్తుంటార ని, వారు కాంగ్రెస్‌ను విడి చి వెళ్లిపోయేలా చేస్తుంటారని విమర్శలు ఉన్నాయి. ఈయన ఏ చర్య తీసుకొన్నా బీజేపీకి అనుకూలంగానే ఉంటుంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బలహీన అభ్యర్థిని నిలబెట్టి.. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు. ఇప్పుడు మునుగోడులోనూ బలహీన అభ్యర్థిని నిలబెట్టి.. మరోసారి పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. కీలక సమయాల్లో ప్రచారానికి దూరంగా ఉండటం రేవంత్‌రెడ్డికే సాధ్యం. టీఆర్ఎస్పై ఒంటికాలిపై లేచే రేవంత్.. రాష్ట్రంలో బీజేపీ నేతలు విద్వేషాలను రెచ్చగొడుతున్నా, కేంద్రంలో బీజే పీ అరాచకాలు సృష్టిస్తున్నా పల్లెత్తు మాట మాట్లాడటం లేదని కాంగ్రెస్ వాదులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి: కాంగ్రెస్‌లో ఉన్నానంటూనే బీజేపీకి సహాయం చేస్తున్నాడని పార్టీలో బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీతో చాలాకాలంగా టచ్‌లో ఉన్నారన్నది బహిరంగ రహస్యం. తమ్ముడు బయటికి వచ్చి బీజేపీ కండువా కప్పుకోగా.. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటూ తరుచూ నిరసనస్వరం వినిపిస్తూ, సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుంటారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయాల్సి వస్తుందనే వంకతో ఏకంగా విదేశీ ప్రయాణం పెట్టుకొన్నట్టు సమాచారం. ఇదీ తమ్ముడు కప్పుకొన్న కాషాయానికి లబ్ధి చేకూర్చేదే.