హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): టెండర్ల పేరుతో అత్యంత విలువైన ధాన్యాన్ని అప్పనంగా అప్పగించే కుట్ర జరుగుతున్నదా? తెరవెనక భారీ అవినీతికి రంగం సిద్ధమైందా? ధాన్యం టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం కనిపిస్తున్నది. 2021-22 యాసంగి సీజన్‌కు సంబంధించిన సుమారు 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి వేలం ద్వారా విక్రయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ధాన్యాన్ని 3 లక్షల క్వింటాళ్ల చొప్పున 11 లాట్లుగా, 1.59 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని ఒక లాట్‌గా విభజించి గత నెల 25న నోటిఫికేషన్ జారీచేసింది. టెండర్లో మొత్తం ఏడు కంపెనీలు పాల్గొని 12 లాట్లకు 30 బిడ్లు దాఖలు చేసినట్టు తెలిసింది. ఇందులో హాకా సంస్థ టెండర్లు రిజెక్ట్ కావడంతో 6 కంపెనీలకు చెందిన 26 బిడ్లు పోటీలో నిలిచాయి. సాధారణ ధాన్యానికి సగటున రూ. 1950, సన్నరకం ధాన్యానికి రూ. 2150 వరకు ధర కోట్ చేసినట్టు సమాచారం.
రూ. 1600 కోట్ల నష్టం
రైతుల నుంచి పౌరసరఫరాలశాఖ క్వింటాలుకు రూ. 2,040-రూ. 2,060 చొప్పున చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సేకరించిన ధాన్యాన్ని దాదాపు 10 నెలలపాటు నిల్వచేసింది. ఈ లెక్కన మొత్తం సొమ్ముకు వడ్డీ, స్టోరేజీ, ఇతర ఖర్చులు కలిపితే క్వింటాలు ధాన్యం ధర రూ. 2,400 నుంచి రూ. 2,500 వరకు ఉంటుందని అంచనా. కానీ, ఆయా కంపెనీలు కోట్ చేసిన ధరనుబట్టి చూస్తే క్వింటాలుకు రూ. 450 నుంచి రూ. 500 వరకు తక్కువగా ఉంది. క్వింటాలుకు సగటున రూ. 450ని పరిగణనలోకి తీసుకున్నా 35 లక్షల టన్నుల ధాన్యానికి మొత్తంగా రూ. 1600 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. బహిరంగ మార్కెట్లో సన్న ధాన్యానికి పలుకుతున్న ధరతో పోల్చితే ఈ నష్టం మరింత పెరుగుతుంది.
రద్దు చేస్తారా? ముందుకెళ్తారా?
గత ప్రభుత్వంలో ధాన్యం వేలానికి టెండర్లు పిలిచినప్పుడు క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 1,732 పలికింది. ఇలాగైతే నష్టం వస్తుందని భావించిన ప్రభుత్వం రూ. 2వేలకు పైగా ధర వస్తేనే విక్రయించాలని భావించి వాటిని రద్దుచేసింది. ఆ తర్వాత మళ్లీ టెండర్లు పిలిచినా ఎన్నికలు రావడంతో మధ్యలోనే ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ టెండర్లను రద్దుచేసి మళ్లీ పిలిచినా ఈసారి కూడా రూ. 2 వేల లోపే ధర పలికింది. బహిరంగ మార్కెట్లో సాధారణ ధాన్యం క్వింటాలుకు రూ. 2,200 నుంచి రూ. 2,300 ధర పలుకుతున్నది. కనీసం ఈ ధర వచ్చినా ప్రభుత్వానికి నష్టం ఉండదు. టెండర్లో దాఖలైన బిడ్ ప్రకారం ముందుకెళ్తే మాత్రం భారీ నష్టం తప్పదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుందా? వెనక్కి తగ్గుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
టెండర్ పక్రియపై అనుమానాలు
ధాన్యం టెండర్ ప్రక్రియలో కఠిన నిబంధనులు విధించడంతో అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టర్నోవర్ అంశంలో అగ్రికల్చర్ కమాడిటీస్, పెద్దమొత్తంలో లాట్స్ పెట్టడం వంటివాటి కారణంగా చాలామంది టెండర్లో పాల్గొనే అవకాశం కోల్పోయారు. గతంలో ఒక్కో లాట్‌కు 15 వేల టన్నులు కేటాయించడం వల్ల 70కిపైగా బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పుడు ఒక్కోలాట్ను 3 లక్షల టన్నులకు పెంచడం వల్ల 26 బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. బిడ్స్ ఎక్కువ వస్తే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడదని లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత టెండర్లను ఎందుకు రద్దు చేశారు?
గత ప్రభుత్వం 25 లక్షల టన్నుల ధాన్యం వేలానికి రెండోసారి పిలిచిన తర్వాత ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ఫిర్యాదు వంటి వాటితో ఆ ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది. అప్పటికే టెండర్ దాఖలు, బిడ్స్ వేయడం కూడా పూర్తయింది. 70కిపైగా బిడ్స్ వచ్చాయి. ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తెరిచి ఉంటే ఎంత ధరకు కోట్ చేశారో తెలిసి ఉండేది. ప్రభుత్వం ఆ ఆలోచనే మరిచి వాటిని ఏకపక్షంగా రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిచింది. టెండర్ల విషయంలో వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తడంతో వ్యాపారులు రెండు గ్రూపులుగా విడిపోయి టెండర్లు దాఖలు చేసినట్టు తెలిసింది. ఒక గ్రూప్ దాఖలు చేసిన టెండర్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురికాగా, మిగిలిన గ్రూప్ రింగ్ చేసి ఏకపక్షంగా టెండర్లలో బిడ్లు దాఖలు చేసి వాటిని దక్కించుకునే ప్రణాళిక రచించినట్టు తెలిసింది.
నష్టం.. ఎవరికి లాభం
ఆయా కంపెనీలు కోట్ చేసిన ధర ప్రకారం ధాన్యం విక్రయిస్తే రూ. 1600 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాలశాఖ వర్గాలు తేల్చాయి. మరి ఈ నష్టం ఎవరికి లాభం చేకూర్చబోతున్నదన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. ధాన్యం టెండర్ల విషయంలో వ్యాపారులు ముందస్తు వ్యూహంతోనే టెండర్లలో పాల్గొన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 13 లాట్లకు 26 బిడ్లు మాత్రమే దాఖలు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ వ్యాపారులతో కలిసి హైదరాబాద్, వరంగల్ వ్యాపారులు కొందరు చక్రం తిప్పినట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారి వీరందరినీ డీల్ చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఒక్కో లాట్‌కు రెండు వేర్వేరు టెండర్లు దాఖలు చేసినట్టు చెప్తున్నారు. అందరూ కుమ్మక్కై బిడ్లు దాఖలు చేయడం వల్లే దాదాపు అన్నీ ధరకు దాఖలైనట్టు తెలిసింది.