హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అటవీ ప్రాంత అభివృద్ధికి, రైతులకు, దీనిపై ఆధారపడ్డ వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. యూఎస్ఏఐడీ, కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సంయుక్త భాగస్వామ్యంతో మూడేండ్లుగా మెదక్ ప్రాంత అటవీ అభివృద్ధి, సమాచార సేకరణ, నిర్వహణ, ప్రణాళిక, పర్యవేక్షణ సులభతరమైందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో డెసిషన్ సపోర్ట్ సిస్టం (డీఎస్ఎస్)-ఆగ్రోఫారెస్ట్రీ టూల్-షేరింగ్ ఆఫ్ ల్యాండ్‌స్కేప్ మేనేజ్మెంట్ ప్లానింగ్, వర్కింగ్ప్లాన్ మ్యానువల్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవిష్కరించారు. మెదక్ అటవీ డివిజన్లో ఫారెస్ట్ ప్లస్ 2.0లో భాగంగా యూఎస్ఏఐడీ (అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ) అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాల ప్రగతి, సాధించిన లక్ష్యాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ… వ్యాన్ సిస్టం ద్వారా తెలంగాణలోని 56 డివిజన్లలో సమాచార సేకరణ పూర్తయిందని చెప్పారు. యూఎస్ఏఐడీ కల్పించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అటవీ ప్రాంత అభివృద్ధికి అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. అటవీ అభివృద్ధి, అడవుల పునరుజ్జీవనం, హరితహారంలో భాగంగా పచ్చదనం పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాల మట్టం పెరిగిందని తెలిపారు. ప్రతికూల వాతావరణ సవాళ్లను అధిగమించేందుకు తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల అధికారి సీన్రూత్ పేర్కొన్నారు.
సుస్థిర అటవీ నిర్వహణలో తెలంగాణ అటవీశాఖతో భాగస్వామి కావటం గర్వంగా ఉన్నదని చెప్పారు. అటవీ, ల్యాండ్‌స్కేప్ మేనేజ్మెంట్ను పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగిస్తున్న అటవీశాఖను యూఎస్ఏఐడీ ఇండియా జనరల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మార్క్ టెగెన్ఫెల్డ్ అభినందించారు. కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా)లోకేశ్ జైస్వాల్, యూఎస్ఏఐడీ(ఇండియా) సీనియర్ ఫారెస్ట్రీ అడ్వైజర్ వర్ఘీస్పాల్, ఫారెస్ట్ ప్లస్ 2.0 చీఫ్ ఉజ్వల్ ప్రధాన్, మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఫారెస్ట్ ప్లస్ రీజినల్ డైరెక్టర్ జీ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ ప్లస్ 2.0 ఉద్దేశాలు